కార్తీక మాసం స్పెషల్
మన పండగల్లో రెండు రకాలుంటాయి! కొన్ని
మగవాళ్ల పండుగలు, కొన్ని ఆడవాళ్ల పండుగలు! అదేంటి అంటారా? అన్ని పండుగలు అందరూ చేసుకోవాల్సినవే అయినా కొన్నిటికి మగవాళ్ల హడావిడి
ఎక్కువగా వుంటుంది. మరికొన్నిటికి ఆడవాళ్ల హంగామా ఎక్కువగా వుంటుంది.
ఉదాహరణకి మొన్నే వచ్చిపోయిన జంధ్యాల పున్నమ తీసుకోండి! ఆ రోజు
మగవాళ్లే ఎక్కువగా పండగ జరుపుకుంటూ వుంటారు. అయితే, ఉత్తరాది నుంచి
వచ్చిన రక్షాబంధన్ ఈ మధ్య బాగా పాప్యులర్ అవ్వటంతో అమ్మాయిలకు, ఆడవాళ్లకు కూడా ఆ రోజు కావాల్సినంత సరదా దొరుకుతోంది. రాఖీలు కడుతూ ఒకప్పటి
తెలుగు వారి జంధ్యాల పున్నమని రాఖీల పున్నమగా మార్చేశారు!
సరే... అయితే... ఇంతకీ వినాయక చవితి ఎవరి పండుగ? ఓ
కోణంలో చూస్తే మగవాళ్లదే! ఎందుకంటే, ఇంట్లో పెట్టే వినాయక
విగ్రహాల వద్ద పూజలు చేయటం మొదలు రోడ్లపైన వెలిసే భారీ గణనాథుల వరకూ అంతటా
మగవారిదే రాజ్యం! ఆడవాళ్లకు ఏం ప్రమేయం వుండదని కాకపోయినా ప్రసాదాలు చేయటం వంటి
పనులు మాత్రమే స్త్రీలు చేస్తుంటారు! ఈ మధ్య కాలంలో అయితే సాయంత్రం అయ్యేలోపు పండగ
పని కానిచ్చి టీవీల ముందు కూర్చుండిపోతున్నారు మాడన్ లేడీస్! ఇంకా ఓపిక వున్న
కొందరైతే అలా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లి వినాయక మండపాలు చూసి వస్తుంటారు! ఇంతే
తప్ప వినాయక చవితితో పెద్దగా కనెక్ట్ అవ్వటానికి వనితలకు ఏం కనిపించదనే చెప్పాలి!
వినాయక చవితికి , ఆడవాళ్లకి పెద్దగా సంబంధం లేదనేస్తారేంటి
అనుకుంటున్నారా? కంగారుపడకండి! పైపైన చూస్తే గణనాథుని
నవరాత్రులకి , ఆడవాళ్లకి ఏం అనుబంధం లేనట్లు అనిపిస్తుంది
కాని... అసలు బొజ్జ గణపయ్య ఆవిర్భావానికే జగదంబ కారణం! అంటే... స్త్రీ అన్నమాట!
లోకంలో అందరూ అమ్మ కడుపులోంచే పుడతారు. వినాయకుడు కూడా అమ్మ వల్లే
పుట్టాడు. కాని, ఇక్కడ విశేషం ఏంటంటే, పార్వతీ
తనయుడు పూర్తిగా అమ్మకూచే! నాన్న శివుడికి నలుగు పిండి నుంచి పుట్టిన ఈ కొడుకెవరో
కూడా తెలియదు! అందుకే కదా... ద్వారం వద్ద అడ్డుపడ్డ విఘ్నేశుని తల నరికి... మళ్లీ
గజాననునిగా చేస్తాడు!
జననం , తరువాత శివుని అడ్డగించటం, ఆ
తరవాత గజాననుడుగా ఏనుగు ముఖం కలవాడవటం పక్కన పెడితే... గణపతి కథలో మరోసారి మనకు
అమ్మ మనసు స్పష్టంగా కనిపిస్తుంది! వినాయకుడు విపరీతంగా కుడుములు తినేస్తే పొట్ట
పెరిగిపోతుంది. దాంతో ఆయన తల్లిదండ్రుల కాళ్లకు కూడా నమస్కారం చేయలేకపోతాడు.
అప్పుడే అతని పొట్టపై చంద్రుడి చూపు సోకి అది కాస్తా పగిలిపోతుంది! ఈ సారి కూడా తన
కొడుకు గురించి పార్వతి తల్లడిల్లిపోతుంది! తండ్రి శివుడి కంటే ఎక్కువగా ఆమె
అల్లాడిపోతుంది. ఆ బాధలోంచి కోపానికిలోనై చంద్రుని శపిస్తుంది కూడా! తల్లి
మనస్సంటే అది!
తల్లి పార్వతే కాదు విఘ్నరాజు జీవితంలో మనకు మరో ఇద్దరు స్త్రీలు
కూడా కనిపిస్తారు. వాళ్లే సిద్ధి, బుద్ధి! ఈ ఇద్దరు గణనాథునికి భార్యలంటారు!
సిద్ధి అంటే విజయం, బుద్ది అంటే తెలివి... ఈ రెండిటిని
స్త్రీలుగా చూపటం ద్వారా మన పూర్వులు ఆడవాళ్ల ప్రాధాన్యత సూచించారు! ఎవరికైనా
మానసికమైన శక్తి, విజయం కావాలంటే స్త్రీతోడు ఖచ్చితంగా
వుండితీరాలనేదే ఇందులోని సూక్ష్మం!
భార్యలు సిద్ది, బుద్ది అయితే.... మరి గణనాథుని కూతురు
ఎవరు? ఆమె సంతోషి మాతా అంటారు ఉత్తరాది వారు! దీనికి పురాణ
ప్రాశస్త్యం లేనప్పటికీ... భావం మాత్రం భలే సుందరంగా వుంటుంది! సంతోషాన్ని కూడా
స్త్రీ మూర్తిగానే భారతీయ సంస్కృతి ఆరాధించింది! ఇంట్లో సంతోషం కలగాలంటే ఎవరు
ముఖ్యమో చెప్పకనే చెప్పింది!వినాయక చవితికి, స్త్రీలకి వున్న
సంబంధం అర్థమైంది కదా? శక్తి స్వరూపం అయిన పార్వతీ ఆయన తల్లి,
సిద్ధి, బుద్ధి ఆయన భార్యలు, సంతోషమే ఆయన కూతురు! ఇలా విఘ్నాధిపతి జీవితం అంతా స్త్రీ శక్తులతోనే
శోభిస్తు దర్శనమిస్తుంది మనకు!
No comments:
Post a Comment