యంగ్ లీడర్స్
........రైసింగ్ సూన్
2019 ఏపీ ఎన్నికల్లో
ముగ్గురు యువనేతల మధ్య ఆసక్తికరమైన ఫైట్‌కు అప్పుడే తెరలేచింది. విచిత్రం
ఏంటంటే ఆ ముగ్గురు యువనేతలు ప్రధానంగా ఒకళ్లనే టార్గెట్ చేస్తుండడం ఇప్పుడు
రాజకీయ మేథావులను సైతం ఆలోచింపజేస్తోంది. ఏపీలో ఇప్పటికే విపక్ష వైకాపా అధినేత
జగన్ గత ఎన్నికలకు ముందు నుంచే రాజకీయంగా స్పీడ్‌గా దూసుకుపోతున్నారు. వాస్తవానికి
2014 ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమే అనుకున్నా..చివరి
రెండు నెలల్లో జరిగిన అనూహ్య పరిణామాలతో జగన్ విపక్షానికే పరిమతమయ్యారు.
ఇక గత ఎన్నికలకు ముందే పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినా ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించి ఆ కూటమి గెలుపునకు తన వంతుగా కృషి చేశాడు. ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ రంగంలోకి దిగడం ఖరారైంది. పవన్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు అనంతపురం సభలో స్వయంగా ఎనౌన్స్ చేసి ఏపీ పాలిటిక్స్‌ను హీటెక్కించాడు.
ఇదిలా ఉంటే వీరిద్దరితో పాటు ఏపీలో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం టీడీపీ భావిసారధిగా, భవిష్యత్ సీఎంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ముగ్గురు ప్రస్తుతం యువతను టార్గెట్‌గా చేసుకుని చేస్తోన్న కార్యక్రమాలపైనే పెద్ద చర్చ నడుస్తోంది. యువతీ, యువకుల ఓట్లనే టార్గెట్‌గా చేస్తూ వీరు కార్యాచరణ స్టార్ట్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కొత్తగా 10-12 లక్షల మంది యువతకు ఓటు హక్కు రానుంది.
వీరిని పక్కన పెడితే ఇప్పటి వరకు ఓటర్లుగా ఉన్నవారు కొందరు సంప్రదాయాలు, కులాల వారీగా కొన్ని పార్టీలకు స్థిర ఓటు బ్యాంకుగా ఉండిపోయారు. ఇక ఎన్నికల టైంలో కొందరు అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే కొత్తగా ఓటు వచ్చే యువత మాత్రం ఓ విజన్‌తో ఉండే ఛాన్సులు ఎక్కువుగా ఉంటాయి. అందుకే ప్రధానంగా వీరిని టార్గెట్ చేస్తే వీరు మిగిలిన వారిని కూడా కొంత వరకు ప్రభావితం చేస్తారు.
ఈ క్రమంలో టీడీపీ ఈ నెల 1న ప్రారంభించిన జన చైతన్య యాత్రలకు యువ చైతన్య యాత్ర పేరు పెట్టి లోకేష్ దూసుకుపోతున్నారు. జగన్ ఇప్పటికే యువ భేరి పేరుతో కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన యువతీ యువకులకు నూరిపోస్తున్నారు. ఈ ఇద్దరి రూట్లోనే జనసేన అధినేత పవన్ సైతం అనంతపురంలోని గుత్తి ఇంజనీరింగ్ కళాశాలల జరిగిన సమావేశంలో యువతతో భేటీ అయ్యారు. వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
పవన్ సైతం యువతకు ప్రత్యేక హోదా అంశాన్నే నూరిపోస్తున్నారు. ఇక లోకేష్ ప్యాకేజీ గురించి యువతకు వివరిస్తున్నారు. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో ఆయన పర్యటన ముగించారు. మరి ఈ ముగ్గురు నేతల్లో యూత్‌ను ఎవరు ఎక్కువ ఇంప్రెస్ చేసి తమకు ఓటు బ్యాంకుగా మార్చుకునే విషయంలో సక్సెస్ అవుతారో చూడాలి.
No comments:
Post a Comment